Coronavirus updates | ఒక్కరోజే 57 కరోనా మరణాలు

♦ ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ 

♦ భయం గుప్పిట్లో చైనా 

♦ నమోదైన మొత్తం 17,205 కేసులు 

♦ ఒక్కరోజే 57మంది మృతి

కరోనా వైరస్  ప్రాణాంతకంగా మారుతోంది. శ్వాస వ్యవస్థపై పంజా విసిరే ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.

కరోనా వైరస్ వ్యాధితో ఇప్పటి వరకు 361 మంది మృతి చెందగా ఆదివారం ఒక్కరోజే 57 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ జిన్హువా నివేదించింది. చైనా ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 17,205 మందికి ఈ వ్యాధి సోకింది.   

సోమవారం చైనా నేషనల్ హెల్త్ కమీషన్ వివరాల ప్రకారం 2,829 కొత్త కేసులు నమోదైనట్లు నిర్ధారించగా..5,173 కొత్త అనుమానాస్పద కేసుల్ని కనిపెట్టారు. ఇప్పటి వరకు చైనా భూభాగంలో 17,205 కరోనా కేసులు నమోదవ్వగా..186 మంది కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. 147 మందికి కరోనా వైరస్ నుంచి బయటపడి ఆస్పత్రి నుంచి డిచార్జ్ అయినట్లు హెల్త్ కమీషన్ ప్రకటించింది.

 ప్రస్తుతానికి తమ ఆధీనంలో 1,89,583 మందికి కరోనా వైరస్ చికిత్సలు చేస్తున్నట్లు, వారిలో 10,055 మంది సురక్షితంగా ఉన్నట్లు హెల్త్ కమీషన్ తెలిపింది. 1,52,700 మంది ఇంకా వైద్య పరిశీలనలో ఉండగా ఆదివారం నాటికి, హాంకాంగ్‌లో 15, మకావో ఎస్‌ఐఆర్‌లో 8, తైవాన్‌లో 10 కేసులు నమోదయ్యాయని తెలిపింది.

కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకోసం ప్రారంభమైన 1000పడకల ఆస్పత్రి

చైనాలోని హుబీ ప్రావిన్స్‌లో వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న వుహాన్‌లో 9 రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో నిర్మించిన 1000 పడకల తాత్కాలిక ఆసుపత్రిని చైనా ప్రారంభించింది.

దాని పక్కనే మరో 2,300 పడకల తాత్కాలిక ఆసుపత్రిని బుధవారం ప్రారంభించనున్నట్లు అధికారిక మీడియా తెలిపింది. సోమవారం నుండి హుషెన్‌షాన్ ఆసుపత్రిలో రోగులకు చికిత్స చేయటానికి సాయుధ దళాలకు చెందిన మొత్తం 1,400 మంది వైద్య సిబ్బంది పని చేస్తున్నారని చైనా ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ  జిన్హువా నివేదించింది.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) జాయింట్ లాజిస్టిక్ సపోర్ట్ ఫోర్స్‌కు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల నుండి 950 మంది, మరియు పిఎల్‌ఎ యొక్క సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళం యొక్క హెల్త్ యూనివర్సిటీల నుంచి వచ్చిన  450 మంది వైద్యులు చికిత్స చేస్తున్నట్లు తెలిపింది. 

ఈ సందర్భంగా “ఈ స్థాయి ప్రాజెక్ట్ కోసం, సాధారణంగా కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని”  ఆసుపత్రిని నిర్మించిన బృందానికి నాయకత్వం వహించిన ఫాంగ్ జియాంగ్ చెప్పారు. “తాత్కాలిక భవనం నిర్మించడానికి కనీసం ఒక నెల సమయం పడుతుంది. కానీ పది రోజుల్లో కరోనా వైరస్ బాధితులకోసం నిర్మించిన ఆస్పత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఫాంగ్ జియాంగ్ జిన్హువాతో చెప్పారు.

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest